ఇదే భారీ పీఆర్సీ!

 

-విద్యుత్ సంస్థల్లో తొలిసారి 35%
-సమైక్యరాష్ట్రంలో 15 శాతంతోనే సరి
-అదనంగా రూ.800 కోట్ల భారానికి సిద్ధమైన సర్కారు..
-విద్యుత్ ఉద్యోగులపై ప్రేమను చూపిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అక్షరాలా.. ముఫ్పై ఐదు శాతం ఫిట్‌మెంట్.. విద్యుత్ ఉద్యోగులను ఆనందోత్సాహాల్లో మునిగేలా చేసిన అంశం.. విద్యుత్ సంస్థల చరిత్రలో మొదటిసారిగా అంతటి భారీ ఫిట్‌మెంట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో పైస్థాయి అధికారి నుంచి మొదలుకుని.. కిందిస్థాయిలో పనిచేసే లైన్‌మన్, హెల్పర్ వరకు కూడా తెలంగాణ ప్రభుత్వానికి నీరాజనాలర్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాలాభిషేకాలు, కృతజ్ఞతార్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. సీఎం కేసీఆర్‌పై, ప్రభుత్వంపై తమ అభిమానాన్ని, సంతోషాన్ని చాటుకుంటున్నారు.

సరైన మార్గదర్శనం.. కఠోరశ్రమ.. టీం వర్క్

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన మొదటి సమావేశం విద్యుత్ అంశంపైనే. అంతటి ప్రాధాన్యమున్న రంగంలో కేవలం ఆరునెలల్లోనే తెలంగాణ రాష్ర్టానికి మొదటి విజయాన్ని అందించడమంటే ఆషామాషీ కాదు. అందుకు సరైన మార్గదర్శనం.. పట్టుదల, శ్రమతో పనిచేసే టీం కావాలి. ఈ రెండు అంశాల్లో అటు సీఎం కేసీఆర్.. ఇటు సొంత రాష్ట్రమనే ఆనందంతో.. ఎలాగైనా మన బతుకులు బాగుచేసుకుని.. సమైక్య పాలకుల శాపనార్థాలను తుత్తునియలు చేయాలని తలచిన విద్యుత్ కంపెనీల ఉద్యోగులు కలిసికట్టుగా.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు మాటల్లో చెప్పాలంటే ఒక టీంలాగా పనిచేశారు. విద్యుత్ సంస్థలపై అపారమైన అనుభవమున్న సీఎండీ 24 గంటల పర్యవేక్షణ తోడ్పడింది. మొదటి విజయాన్ని అందించారు. అది చరిత్రలో నిలిచిపోయే విజయం. సమైక్యరాష్ట్రంలో పాలకులు నామమాత్రంగా పీఆర్సీలను ప్రకటించడం తెలిసిందే. కేవలం 15 శాతం పీఆర్సీని ప్రకటించిన వైనం కూడా అనుభవంలో ఉన్నదే. 1998 నుంచి ఇప్పటివరకు వచ్చిన ఆరు పీఆర్సీలలో తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన 35 శాతమే అత్యధికం కావడం గమనార్హం.

45 వేల మందికి లాభం.. 800 కోట్ల వ్యయం..

తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో (ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో, జెన్‌కో) ప్రస్తుతం మొత్తం 25,431 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరు కాకుండా.. 20,030 మంది పింఛనుదార్లున్నారు. తాజాగా 35 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడంతో విద్యుత్ సంస్థలకు అదనంగా సుమారు రూ.800 కోట్లకుపైగా వ్యయమవుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఒక శాతం ఫిట్‌మెంట్ పెంచితే.. ఉద్యోగులు, పింఛనుదారులకు సంబంధించి ఏటా సుమారు రూ.24 నుంచి రూ.24 కోట్ల వరకు వ్యయమవుతుంది. నమ్మకాన్ని వమ్ముచేయకుండా రాష్ర్టానికి తొలి విజయం అందించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ లెక్కలను పట్టించుకోకుండా.. విద్యుత్ ఉద్యోగులపై ఉన్న ప్రేమంతో 35 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. పీఆర్సీ ఫైనలైజేషన్, అగ్రిమెంట్ తదితర ప్రక్రియను పూర్తిచేయడానికి పీఆర్సీపై ఏర్పాటైన కమిటీ బుధవారం విద్యుత్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనుంది.

మనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

మొదటిసారిగా 35శాతం భారీ ఫిట్‌మెంట్‌ను ప్ర కటించడం.. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, కార్మికులపై సీఎం కేసీఆర్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనమని ట్రాన్స్‌కో. జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. భారీ ఫిట్‌మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినోద్‌కుమార్, అనిల్, వినయ్, ప్రణీత, టీఈఈ 1104 సంఘం ప్రతినిధులు పద్మారెడ్డి, సాబుబాబా, సుధీర్, శంకర్, జనార్దన్‌రెడ్డి, వేణు, వరప్రసాద్, విద్యుత్ ఉద్యోగుల జాక్ ప్రతినిధులు ప్రకాశ్, శివాజీ, అంజయ్యతోపాటు పలు విద్యుత్ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ఆయనను కలిసి భారీ పీఆర్సీ ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులపై సీఎం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత దీక్షతో బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.