కీసర రిజర్వు ఫారెస్ట్ దశను మారుస్తా

mp Joginapally Santosh Kumar launches Keesara forest rejuvenation work

-తొలుత రూ.3కోట్లతో అభివృద్ది పనులు
-మూడేండ్ల తరువాత ఎలా ఉంటుందో చూడండి
-కీసర రిజర్వు ఫారెస్ట్ దశ మారుస్తా
-ఎన్ని నిధులైనా సరే అద్భుత అభివృద్ధి చూపిస్తా
-గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో దత్తత తీసుకున్నా
-సీఎం కేసీఆర్ నుంచి పట్టుదలను నేర్చుకున్నాం
-కీసర రిజర్వు ఫారెస్ట్ సభలో ఎంపీ సంతోష్‌కుమార్

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కీసర రిజర్వు ఫారెస్ట్ దశను మారుస్తానని, ఎన్ని నిధులైన సరే వెనుకాడకుండా అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తానని రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో దత్తత తీసుకున్న 2,042 ఎకరాలలో తొలుత రూ.3కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితి.. మూడేండ్ల తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని కోరారు. సీఎం కేసీఆర్ నుంచి పట్టుదలను నేర్చుకున్నామని చెప్పారు. కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకున్న తరువాత తొలిసారి శనివారం మంత్రి మల్లారెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డితో కలిసి సందర్శించిన ఆయన విద్యార్థులు, మహిళాసంఘాల సభ్యులు, అధికారులతో కలిసి సుమారు 10 వేల మొక్కలను నాటారు. అంతకుముందు ఉదయం 9గంటల సమయంలో కీసర శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

haritha-chaitanyam
కీసర ఫారెస్ట్‌లో తొలివిడుతగా రూ.3కోట్ల ఎంపీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కీసరగుట్టపై ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. కీర్తి ప్రతిష్ఠలకోసం కాదు.. కీసర రిజర్వు ఫారెస్ట్ దశను మార్చేందుకే దత్తత తీసుకున్నానని ఆయన చెప్పారు. అన్నయ్య, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో దత్తత తీసుకున్న 2,042 ఎకరాలను అభివృద్ధి చేస్తానన్నారు. చాలా ఇచ్చిన ఈ సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ఈ బాధ్యత తీసుకున్నానని, ఇందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారం కావాలి అని కోరారు. నేను మీతో ఉన్నాను, మీరు నాతో ఉండండి అని అభ్యర్థించారు.

keesara-forest

ఆధ్యాత్మికత.. ఆహ్లాదం..

కీసర రిజర్వు ఫారెస్ట్‌ను ఓ వైపు ఆధ్యాత్మికత, మరోవైపు ఆహ్లాదం ఉట్టిపడేలా అద్భుతంగా మారుస్తానని భగవంతుని సాక్షిగా చెప్తున్నానని సంతోష్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ వెంట గత 20 ఏండ్లుగా ఉంటున్నానని, ఈ 20 ఏండ్లలో ఆయన మాకు నేర్పింది, మేము నేర్చుకుంది పట్టుదల అని చెప్పారు. హరితహారం ఓ సామాజిక బాధ్యత అని, ఆకుపచ్చని తెలంగాణను కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ప్రతి పౌరుడు హరితహారంలో పాల్గొని, నాటిన ప్రతి చెట్టును సంరక్షించాలన్నారు.

keesara-forest3

ఎంపీ సంతోష్ నిర్ణయం చారిత్రాత్మకం

కీసర రిజర్వు ఫారెస్ట్‌ను దత్తత తీసుకోవాలనే ఎంపీ సంతోష్ నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ చెట్లు ఉంటేనే నీరు వస్తుందని, నీరు ఉంటేనే మనిషి, సమస్త జీవకోటి మనుగడ సాధిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ మలిపెద్ది సుధీర్‌రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ భూపాల్‌రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎంవీరెడ్డి, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, హైదరాబాద్ రేంజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫీసర్ చంద్రశేఖర్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి, గ్రేటర్ టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్‌యాదవ్, రైతు సమన్వయసమితి జిల్లా సమన్వయకర్త నందారెడ్డితోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళాసంఘాల సభ్యులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు వేలసంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *