టీఆర్‌ఎస్ వెంటే తెలంగాణ సమాజం: కేటీఆర్

 

తెలంగాణ సమాజం మొత్తం టీఆర్‌ఎస్ వెంటే ఉందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది తరలివచ్చారు. ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ నేతలను తిట్టనందుకు వాళ్లు బాధపడుతున్నారన్నారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించేందుకే ప్రగతి నివేదన సభ పెట్టినమన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటామన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిందన్నారు. నారాయణఖేడ్, పాలేరు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచిందంటే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు. రాహుల్‌గాంధీ వస్తే తాము భయపడుతమా..? అని కేటీఆర్ అన్నారు.

రాహుల్‌గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ఇంటింటికీ తాగునీరందిస్తున్నం. అన్నదాతలు అప్పులపాలవకుండా రైతు బంధు పథకం అమలు చేస్తున్నాం. పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ.లక్షా 116 అందిస్తున్నం. రాష్ట్ర అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతల కళ్లు మండుతున్నాయి. 43 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నమన్నారు. 4 లక్షల మంది బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తున్నందుకు టీఆర్‌ఎస్ దిగిపోవాలా..?అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు బీమాతో రైతుకు భరోసా కల్పించినమన్నారు. కోటి ఎకరాల మాగాణి కావాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌లో అందరి కుటుంబాలు రాజకీయాల్లో ఉండొచ్చు..కానీ సీఎం కేసీఆర్ కుటుంబం ఉండకూడదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముసిముసి నవ్వులు నవ్విన్రు. తెలంగాణ ఎట్ట వచ్చిందో..ఎవరు సాధించారో ప్రజలకు తెలుసు. కామారెడ్డి నియోజకవర్గాన్ని సిరిసిల్లలా అభివృద్ధి చేస్తం. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేస్తం. ఎన్నికల్లో ఖచ్చితంగా 100 సీట్లు తెలుస్తం. కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొడుతం. మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published.