-పేదలు, రైతులు, మహిళలకు ఎంతోమేలు
-సీఎం కేసీఆర్ పనితీరు భేష్
-ప్రశంసల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి అథావలే
-కామారెడ్డిలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పనితీరుపై కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాందాస్ అథావలే ప్రశంసల వర్షం కురిపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకట్టుకునే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని, ముఖ్యంగా పేదలు, రైతులు, మహిళలు, దివ్యాంగులు, యువత, బడుగు, బలహీన వర్గాలకు అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేసేందుకు ఎంపీ బీబీ పాటిల్ అధ్యక్షతన కామారెడ్డి జిల్లా కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమానికి అథావలే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో రెండున్నర కోట్ల మంది దివ్యాంగులను గుర్తించగా ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందికి ఉపకరణాలను అందజేశామన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందని, భారీ రాయితీలతో రుణాలను అందజేస్తున్నదని తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా దివ్యాంగులకు మరింత తోడ్పాటును అందించేందుకు కృషిచేస్తున్నట్టు లోక్‌సభ సభ్యుడు బీబీ పాటిల్ చెప్పారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జెడ్పీ చైర్మన్ డీ రాజు, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు చెందిన 669 మంది దివ్యాంగులకు రూ.43 లక్షల విలువచేసే 2,617 పరికరాలను పంపిణీ చేశారు.
రైతుబంధు, రైతుబీమా ప్రశంసనీయం..
హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, విత్తనోత్పత్తి పథకాలను అస్సాం ప్రభుత్వ అదనపు ముఖ్యకార్యదర్శి వీఎస్ భాస్కర్ ప్రశంసించారు. మంగళవారం ఆయన సచివాలయంలో వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి, ఉద్యానశాఖ డైరెక్టర్ ఎల్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కే కేశవులుతో సమావేశమయ్యారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి పార్థసారథి ఈ సందర్భంగా భాస్కర్‌కు వివరించారు.