అధికారం కోసం.. కాంగ్రెస్ అరాచక ప్రయత్నం!

  • అధికారం కోసం.. కాంగ్రెస్ అరాచక ప్రయత్నం!

– అమలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్న మాజీ ప్రతిపక్షం
– ప్రజలు ఛీ కొడుతున్నా పట్టింపు లేని వైనం
– హామీల పేరుతో జనాన్ని మరోసారి మోసం చేసే ప్రయత్నం

మింగ మెతుకులేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలని అన్నాడట వెనకటికి ఒకడు. కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తూ.. జనంతో మరోసారి ఛీ కొట్టించుకుంటున్నారు. ఓ పద్ధతి లేదు. నిర్మాణాత్మక ప్రయత్నం లేదు. జనానికి ఏం చేస్తే మంచిదో.. ఏం చేస్తే పేదరికం పోతుందో తెలియదు. అన్నీ ఇచ్చేస్తాం.. అన్నీ ఇచ్చేస్తాం.. మాకే ఓటు వేయండి.. అని ఓటర్లను మాత్రం అడుక్కోవడం తెలుసు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ.. అది చేస్తాం ఇది చేస్తాం అంటూ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇలా ప్రజలు బాధపడాల్సివస్తోంది.

ఉమ్మడి రాష్ట్రం విడిపోవడానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీ పదేళ్లు అధికారంలో ఉంది. తెలంగాణను అడ్డుకునేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది. తెలంగాణ సంపదను సీమాంధ్ర ప్రాంతానికి దోచి పెట్టింది. ఇక్కడి నీళ్లను, ఇక్కడి ఉద్యోగాలను, ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన నిధులను.. సీమాంధ్రకు ఖర్చు చేసింది. స్వరాష్ట్రం కోసం తెలంగాణ యువత ప్రాణాలను పణంగా పెడుతున్నా పట్టించుకోకుండా కాలయాపన చేసింది. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాతే.. ఎన్నికల సమయంలో తెలంగాణను ఏర్పాటు చేసింది. తమకు ఇంత నష్టం చేసిన కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ఎలా క్షమించగలరు? ప్రాణాలకు తెగించి తెలంగాణను సాధించిన కేసీఆర్ నాయకత్వాన్ని, ఆయన మార్గదర్శకత్వాన్ని ఎలా వదులుకోగలరు?

అందుకే.. ప్రతి ఎన్నికల్లో ప్రజలు మెజారిటీ ఫలితాలను టీఆర్ఎస్ కే ఇస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న టీఆర్ఎస్ కూడా.. అన్ని రంగాలకు సంక్షేమాన్ని పంచతూ.. ప్రజాదరణను టీఆర్ఎస్ పెంచుకుంటోంది. తెలంగాణలో అజేయ రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇది చూసి కళ్లు కుట్టిన కాంగ్రెస్.. మరోసారి మున్సిపల్ ఎన్నికల వేళ కుట్రలకు పదును పెట్టింది. పాలన అంటే తెలియని పరిస్థితికి దిగజారిన ఆ పార్టీ.. తమకు అధికారం ఇస్తే.. అన్నీ ఫ్రీగా ఇస్తామన్నట్టుగా ప్రకటనలు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తమనే గెలిపించాలని కోరుతోంది.

కానీ.. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన.. ఆ హామీలన్నీ ఎలా అమలు చేస్తారన్నది కాంగ్రెస్ కే తెలియాలి రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల స్థాయిలో ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ నేతలకే తెలియాలి. ఇలా.. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ చెబుతున్న మాటలను నమ్మేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. వారికి ఎవరు మంచి చేస్తారో.. ఎవరు చెడు చేస్తారో తెలుసుకోలేనంత మూర్ఖులు కారు ప్రజలు. అందుకే.. మరోసారి హస్తానికి ఫ్రాక్చర్ చేయాలని.. కారు వేగానికి అడ్డంకులు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *