కేంద్రంతో.. పోతిరెడ్డిపాడును ఆపించు సంజయ్!

 

కేంద్రంతో.. పోతిరెడ్డిపాడును ఆపించు సంజయ్!

  • కేసీఆర్ పై విమర్శలు కాదుచేతనైతే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
  • కేంద్రంలో ఉన్న అధికార బలంతో.. పోతిరెడ్డిపాడును ఆపించాలి
  • అలా చేస్తే కృష్ణమ్మ నీళ్లతో కాళ్లు కడుగుతామంటున్న ప్రజానీకం

బండి సంజయ్.. నువ్వు అడిగే ప్రశ్నలు ఇప్పటికే చాలా మంది అడిగారు. ప్రజలు వాటికి బహిరంగంగా సమాధానాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎదురు తిరిగే సమయం వచ్చింది. పోతిరెడ్డిపాడు విషయంలో.. బీజేపీ వైఖరి స్పష్టం కావాల్సిన సమయం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా.. నిజంగా ఛేవ ఉన్న నాయకుడివే అయితే.. నువ్వు ఓ పనిని విజయవంతంగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. ఆ బలం నిజంగా.. రాష్ట్ర బీజేపీకి ఎంతో కొంత పనికి వచ్చేదే కదా. ఆ బలాన్ని ఇప్పుడు సంజయ్ ఉపయోగించాలని ప్రజలు కోరుతున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎదిగిన నాయకుడు.. దక్షిణ తెలంగాణకూ మేలు చేయాలని కోరుతున్నారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు గండి పెంచితే తెలంగాణకు ఎదురయ్యే నష్టాన్ని కేంద్రానికి వివరించి.. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకునేలా చేయాలని కోరుతున్నారు.

ఎలాగూ.. కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే.. ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ లేఖను రాసింది. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే చారిత్రక అవకాశం.. బండి సంజయ్ చేతిలో ఉంది. ఆ లేఖకు.. తెలంగాణ ప్రభుత్వానికి సానుకూలంగా స్పందన వచ్చేలా సంజయ్ ప్రయత్నించాలి. పోతిరెడ్డిపాడు గండి పెంపు ప్రయత్నం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ చర్యను ఆపేలా.. ఆదేశాలు ఇప్పించగలగాలి.

అప్పుడే.. ఆయన నిజమైన.. నిఖార్సైన నాయకుడు అని గుర్తిస్తామంటూ.. తెలంగాణ ప్రజానీకం చెబుతోంది. నిజంగా.. ఈ పని సాధించగలిగేతే.. కృష్ణమ్మ నీళ్లతో సంజయ్ కాళ్లు కడుగుతామని దక్షిణ తెలంగాణ ప్రజానీకం అంటున్నారు. ఒకవేళ చేయలేక పోతే.. ఉత్తర తెలంగాణ బీజేపీకే అధ్యక్షుడిగా చూస్తామని హెచ్చరిస్తున్నారు. సంజయ్ ని తమ ప్రాంతంలో అడుగు పెట్టనిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు.