తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముమ్మాటికి సీఎం కేసీఆర్ త్యాగఫలమే…
రాజ్యాంగ సంక్షోభం సృష్టించి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు…
గత్యంతరం లేకనే ప్రత్యేక రాష్ట్రాన్ని నాటి కేంద్రం ప్రకటించింది.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని ఆ పార్టీ నేత నిరంజన్ తెలుసుకుంటే మంచిది…
దశాబ్దాలుగా తండ్లాడిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కల సాకారం చేసింది తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావని ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఈ విషయమై కాంగ్రెస్ నేత నిరంజన్ పంచాయతీకి దిగడం ఆయన అవగాహనా రాహిత్యాన్ని సూచిస్తుంది. నిజానికి ఎన్నో దశాబ్దాలుగా ఈ ఉద్యమం జరిగినప్పటికీ కూడా కేసీఆర్ నేతృత్వంలోని మలి దశ ఉద్యమంలోనే తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టడంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు పై నాన్చుడు ధోరణి అవలంబించి, ఎంతోమంది బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్రంపై సీఎం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. అందుకే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న అనేక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టి, అధికారాన్ని అప్పగిస్తూ వస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేడు ఏమైందో అందరికీ తెలుసు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ నేడో రేపో అన్నట్లుగా ఉంది.
నిజానికి 2001లో ప్రత్యేక పార్టీ పెట్టి తెలంగాణ కోసం కెసిఆర్ బలంగా పోరాడకపోయి ఉంటే ఇప్పటికి కూడా సమైక్య పాలకుల చేతిలో తెలంగాణ ప్రజలు అవమానాలకు గురయ్యేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నీళ్లు నిధులు నియామకాల కోసం చేపట్టిన పోరాటం ఫలించి తెలంగాణ దేశంలోని అభివృద్ధి సంక్షేమం లో నెంబర్ వన్ గా నిలిచింది. నిజానికి సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు వంచనకు గురి అవడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణకు రావాల్సిన, దక్కవలసిన అనేక హక్కులను కాలరాయడంతోనే తెలంగాణ ప్రజలు తిరుగుబాటుకు పురిగొల్పేలా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నాంది పలికింది.
అలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని చెప్పుకోవడం కాంగేయులకు సిగ్గుచేటు. నాడు కేసీఆర్ రాజ్యాంగ సంక్షోభం సృష్టించి కేంద్రం మెడలు వంచడం తోటి గత్యంతరం లేని పరిస్థితిలో తెలంగాణాను నాటి ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాని ఇందులో కాంగ్రెసు ఘనత ఏమీ లేదు గత ఆరేళ్లుగా ప్రజల వైఖరిని చూస్తే స్పష్టం అవుతోంది. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలన చూసి ఇతర పార్టీ గురించి గానీ ఇతర నాయకుల గురించి గానీ ప్రజలు ఆలోచించే పరిస్థితి రాలేదు. ఓవైపు రోజురోజుకు టిఆర్ఎస్ బలపడుతుండగా.. రాష్ట్రంలోని మిగతా ప్రతిపక్షాలు అంతరించే స్థితికి రావడమే దీనికి ప్రబల ఉదాహరణ.