- వడ్లు కొనేదాకా వెంటపడుడే
- లేకపోతే అంతం జూసుడే
- కేంద్రంపై కొనసాగుతున్న తెరాస పోరాటం
తెలంగాణ ఉద్యమం వంటి మరో పోరాటాన్ని తెరాస షురూ చేసింది. యాసంగిలో తెలంగాణ రైతుల వడ్లను కేంద్రంతో కొనిపించడానికి నిర్విరామ పోరాటానికి రెడీ అయింది. ఢిల్లీలో అగ్గిపెట్టడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రైతులకు న్యాయం జరిగేదాకా కొట్లాట కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. రైతులపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా..రేపు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని తెరాస నిర్ణయించింది.
మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు ఉత్పత్తి చేశారంటే అది తెలంగాణ రాష్ట్ర సీఎం ఘనతే! యసంగి వడ్లు కొనం అనే బీజేపీ నాయకుల మాటలను తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పాలని తెరాస నిర్ణయించుకుంది. ఈ మాటల వెనుక ఉన్న కుట్రలను ప్రజలకు వివరించడానికే తెరాస నిరసనలకు దిగుతోంది. దేశంలో ఆకలి చావులు ఉన్నాయి. పేదరికం పెరుగుతుందని అనేక ప్రపంచ దేశాల సర్వేలు చెబుతుంటే మోదీ మాత్రం గొప్పలు చెప్పుతున్నాడు.
సీఎం కేసీఆర్ లాంటి నాయకున్ని డైరెక్ట్ గా మోడీ ఎదుర్కోలేక ఇలాంటి నాటకాలకు తెరలేపుతున్నాడు. ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట చెప్పే బీజేపీ నాయకులను రైతులే తరిమికొడుతారు. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రైతాంగాన్ని కాపాడుకొనే బాధ్యత తమ మీద ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వం యాసంగి వడ్లను ఎందుకు కొనడం లేదనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా వివరించడానికి తెరాస నాయకులు రంగంలోకి దిగారు.
యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను సన్నద్ధం కావడం మినహా మనకు మరో మార్గం లేదని నచ్చజెపుతున్నారు. ఆహార భద్రత కల్పించడం కోసం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఎఫ్సీఐ.. ఉప్పుడు బియ్యం పేరుతో యాసంగి వరి ధాన్యం కొనుగోలును నిలిపివేయడంతో ఈ సమస్య ఏర్పడింది. ఇందుకు నూటికి నూరుశాతం మోడీ ప్రభుత్వం కారణం. పోరాటంతో ఢిల్లీ మెడలు వంచితే తప్ప మనకు న్యాయం జరగదు.